పల్లికొండ మణికంఠ
Abstract
ఇటీవల మళ్ళీ తెరపైకి వచ్చిన రోహిత్ వేముల కేసు గురించి ఇప్పుడున్న పరిస్థుతుల దృష్ట్యా ఆలోచిస్తే, మనకు అర్థం అయ్యేది ఏమిటంటే – ఒక మనిషి లేదా సమూహనికి అన్యాయం జరిగితే, పౌర సమాజం మొదటగా చూసేది కులం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రోహిత్ మరణించాడు అనేది చర్చ కాదు. ఎలా, ఎందుకు మరణించాడు అనే ప్రశ్నలను ఏనాడో ఈ పౌర సమాజం పక్కన పెట్టింది. అప్పుడు, ఇప్పుడు ఉన్న ఏకైక ప్రశ్న – రోహిత్ ఎవరు? ఈ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే మన సమాజంలో దాగి ఉన్న కుల ఆధిపత్య సంబంధాలు బయట పడతాయి. రోహిత్ విషయంలో కూడా ఈ ప్రశ్న తన కన్నతల్లికి ఒక శాపంగా మారింది. బహుశా ఈ పౌర సమాజానికి, రాధికమ్మ నుండి Dear Civil Society, I have no homeland అనే మాటను వినాలనుందేమో! పోరాడుతూ, అవహేళనకు గురవుతున్న రాధికమ్మ లాంటి ఒక తల్లి పడే వేదనను చూస్తూ ఈ సందర్భాన్ని ఇంకో విధంగా ఈ దేశానికి ఆ తల్లి చెప్పాల్సి వస్తే ఇలా చెప్పేదేమో – Dear homeland, I don’t even belong to your civil society! అందుకే ఈ ప్రశ్న – రోహిత్ వేముల, తల్లి రాధికమ్మకు దక్కాల్సిన న్యాయం కోసం ఎవరు పోరాడాలి?
~ పల్లికొండ మణికంఠ సామాజిక – రాజకీయ విశ్లేషకులు; రాజనీతిశాస్త్ర అధ్యాపకులు, PACPET – Tellapur, Hyderabad
~
ఈ దేశంలో ఒక సగటు మనిషి బ్రతకడానికి కావాల్సింది-కులం. బహుశా, ఈ మాట విన్న ఎవరికైనా కోపం రావచ్చు. అయితే ఈ కోపం ఎవరికీ వస్తుంది అనేది కూడా ఒక సందేహమే. కులం లేదని నమ్మిన వారికా? లేక కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసే వారికా? ఇటీవల మళ్ళీ తెరపైకి వచ్చిన రోహిత్ వేముల కేసు గురించి ఇప్పుడున్న పరిస్థుతుల దృష్ట్యా ఆలోచిస్తే, మనకు అర్థం అయ్యేది ఏమిటంటే – ఒక మనిషి లేదా సమూహనికి అన్యాయం జరిగితే, పౌర సమాజం మొదటగా చూసేది కులం. మన రాజకీయ వ్యవస్థలో ఇప్పటికి ఉన్న కుల అహంకార, ఫ్యూడల్ కల్చర్ లు, మన పౌర సమాజాన్ని సామాజికంగా చంపేసాయి అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
రోహిత్ వేముల కులం ‘ఏది’ అనే చర్చ ఇప్పటికి ఉనికిలో ఉండడం, ఆర్థిక మంత్రి నిర్మలగారు (04/05/2024 రోజున) బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం, అటు పోలీసు వ్యవస్థ, ఇటు ప్రభుత్వం మరోసారి కుటుంబ సబ్యులకు న్యాయం చేస్తాం అని భరోసా ఇయ్యడం – ఇవ్వన్నీ దేనికి సంకేతాలో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది. ఒక సమాజం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో, అందులో ఎన్నో ఒడిదొడుకులను ఎదురుకోవచ్చు కానీ న్యాయం కోసం ఎలా పోరాడాలి, ఆ పోరాటానికి ఎటువంటి ఆదర్శాలు ఉండాలి అని మన అజెండాలో లేనంతకాలం న్యాయం జరగడం ఆలస్యం అవుతుందని మనం గుర్తించాలి.
Justice delayed is justice denied అనే నానుడి ని వినే ఉంటారు. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ, రోహిత్ వేముల అమ్మ, రాధికమ్మ గారు JNU లో మాట్లాడిన మాటలను ఇక్కడ గుర్తుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను 2015-2017 లో పని చేసిన BAPSA విద్యార్ధి సంఘము నిర్వహించిన Nation without Social Justice అనే పబ్లిక్ టాక్ (24/08/2016) లో రాధికమ్మ మాట్లాడుతూ పౌర సమాజం ప్రదర్శిస్తున్న వైఖరిని ఇలా ప్రశ్నించారు “నా కొడుకు దళితుడు కాదని అందరు నిర్దారించే పనిలో ఉన్నారు. నా కులం ఏంటో, రోహిత్ కులం ఏంటో ఈ కన్నతల్లికి తెలుసు. అయితే ఒకవేళ రోహిత్ ఓబీసీ కులం అని అనుకుంటే ఈ తల్లి తన పోరాటం ఎందుకు ఆపాలి? రోహిత్ ఓబీసీ అయ్యి ఉంటే నేను మౌనంగా ఉంటానని ఈ దేశం ఎందుకు అనుకుంటుంది?”.
రోహిత్ ను ఒక ఎదుగుతున్న శాస్త్రవేత్తగా ఎవరు గుర్తించకపోయిన (రోహిత్ మాటల్లో – I always wanted to be a writer. A writer of science, like Carl Sagan) తాను ఒక సగటు మనిషి. అయితే, ఈ సగటు మనిషి జీవితం తన అస్తిత్వం (identity) చుట్టే తిరుగుతుందని ఆనాడే రోహిత్ తన చివరి లేఖలో ఇలా రాసాడు “…The value of a man was reduced to his immediate identity and nearest possibility. To a vote. To a number. To a thing. Never was a man treated as a mind…”.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రోహిత్ మరణించాడు అనేది చర్చ కాదు. ఎలా, ఎందుకు మరణించాడు అనే ప్రశ్నలను ఏనాడో ఈ పౌర సమాజం పక్కన పెట్టింది. అప్పుడు, ఇప్పుడు ఉన్న ఏకైక ప్రశ్న – రోహిత్ ఎవరు? రోహిత్, దళితుడిగా చనిపోయాడా? లేక ఓబీసీ గా చనిపోయాడా? (లేక ఒక మనిషిగా, శాస్త్రవేత్తగా చనిపోయాడా? – ఈ ప్రశ్న అడిగే వాళ్ళు తక్కువే అనుకోండి) .
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే మన సమాజంలో దాగి ఉన్న కుల ఆధిపత్య సంబంధాలు బయట పడతాయి. రోహిత్ విషయంలో కూడా ఈ ప్రశ్న తనకు, తన కన్నతల్లికి ఒక శాపంగా మారింది. ఒక విశ్వమానవుడిగా మాత్రం రోహిత్ చనిపోలేదు. కాదు, ఈ వ్యవస్థ చావనివ్వలేదు. బహుశా ఆలా చివరి శ్వాస వదిలి ఉంటే, ఆ లేఖను రోహిత్ ఇంకోవిధంగా రాసేవాడేమో.
నేను HCU లో చదువుతున్న కాలంలో, కొన్ని సందర్భాలలో రోహిత్ తో మాట్లాడినప్పుడు (2013-2015), వ్యవస్థలో, మనలో ఉన్న లోపాల గురించి నాతో మాట్లాడుతూ, “యూనివర్సిటీ లో చేస్తున్న ఆక్టివిజం కేవలం ఇక్కడికే పరిమితం అయితే, మనం చేసే అభ్యుదయ రాజకీయాలకు అర్థం ఉండదని” తాను మొదటగా SFI లో పని చేస్తున్న రోజులలో ఇలా అన్నాడు. తన లేఖలో ఇదే విషయాన్ని ఇంకెంతో లోతుగా రాస్తూ “I loved Science, Stars, Nature, but then I loved people without knowing that people have long since divorced from nature…” అని అన్నాడు.
మనుషులు ప్రకృతి నుంచి దూరం అవ్వడం అంటే తమని తాము సామాజికంగా చంపుకోవడం. సమాజంలో ఉనికిలో ఉన్న అసమానత వ్యవస్థ కూడా మనని అటువంటి పరిస్థితుల్లోకి నెట్టుతుంది. అప్పుడు పౌర సమాజం తమను తాము బుద్ధి జీవులుగా పరిగణించకుండా, న్యాయం పట్ల మౌనం పాటిస్తుంది. ఇలా మౌనంగా ఉండడం మానవాళికి సిగ్గుచేటు అని అనను కానీ, ఇటువంటి పరిస్థితి అసమానతలను ఇంకా పెంచి పోషిస్తాయి అని అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.
రాజ్యానికి, పౌర సమాజంలో ఉన్న మౌనం ఒక వరం లాంటిది. ఈ మౌనం వ్యవస్థీకరించబడితే అప్పుడు ఎక్కువగా నష్టపోయేది ఈ సమాజంలో ఉన్న మహిళలు, బలహీన వర్గాలు. అందుకే ఆ మౌనం శాపంగా మారకూడదని రాధికమ్మ ఎప్పుడు తన ప్రశ్నలను, పోరాటాన్ని ఆపలేదు. ఆలా పోరాటాన్ని ఆపని ఒక కన్నతల్లికి ఈ పౌర సమాజం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన ఇచ్చిందో ఒకసారి ఆలోచిద్దాం.
రాధికమ్మ చేస్తున్న పోరాటం గురించి జూన్ 2016 లో ముత్తుకృష్ణ (JNU లో చదువుతున్న ముత్తు, 13th మార్చ్ 2017 న ఆత్మహత్య చేసుకున్నాడు) అనే రీసెర్చ్ స్కాలర్ తన వ్యాసంలో ఆ తల్లి ని ‘A Universal Mother Without a Nation’ అని అభివర్ణించాడు. అదే విధంగా 1931లో “Gandhiji, I have no homeland” అని బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్న మాటను మీరు వినే ఉంటారు. ఈ రెండు వ్యాఖ్యలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఈ వ్యవస్థ ప్రదర్శిస్తున్న మౌనం, కోపం గురించి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి.
ఈ దేశంలో ఏ రంగంలో అయినా, బలహీన వర్గాలు, తమ ఉనికిని మొదటగా వ్యక్త పరిచేందుకు ఎన్నో ఇబ్బందులు పడతారు. ఈ విశాల సమాజంలో తమ స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటారు. సభ్యసమాజం కూడా ఆ వర్గాల ఉనికిని తరచు అవహేళన చేస్తూ ఉంటుంది. భారత స్వాతంత్రోద్యమ సమయంలో కూడా ఇటువంటి ప్రశ్నలు ఎన్నో వచ్చాయి.
ఉదాహరణకు, అక్టోబర్ 1939 బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లో, ఈ దేశంలో బలహీన వర్గాల స్థానం గురించి ఎన్నో నివ్వెరపోయే విషయాలను వివరిస్తూ, డా. అంబేడ్కర్ ఇలా అన్నారు “I know my position has not been understood properly in the country. It has often been misunderstood. My position is – As between the country and myself, the country will have precedence ; as between the country and the Depressed Classes, the Depressed Classes will have precedence—the country will not have precedence.”
అంబేడ్కర్ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పు పడుతూ ఇలా బదులు ఇచ్చారు బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్, “Ambedkar said-as between the depressed classes and the country, the depressed classes have precedence with him. My quarrel is with that statement of his. Because the part can never be greater than the whole. The whole must contain the part.”
ఇక్కడ the whole అంటే దేశం, the part అంటే బలహీన వర్గాలు. అంబేడ్కర్ చేసిన వ్యాఖ్యలను విభేదిస్తూ, దేశ ప్రయోజనాలే ముఖ్యమని, దేశం కన్న ఇంకేది గొప్పది కాదని, గంగాధర్ ఖేర్ అభిప్రాయం. ఖేర్ అన్న మాటలకూ స్పందిస్తూ, “I am not a part of the whole ; I am a part apart” అని అన్నారు అంబెడ్కర్.
‘Gandhiji, I have no homeland’ అని 1931 లో, ‘I am not a part of the whole ; I am a Part Apart’ అని 1939 లో చేసిన ఈ రెండు వ్యాఖ్యాలను మనం అధ్యయనం చేస్తే, మన దేశంలో ఉన్న కులం, బలహీన వర్గాలను మానసికంగా, సామాజికంగా (దేశానికి) దూరం చేసింది అని అర్థం అవుతుంది. ఈ దేశంలో ఉన్న శూద్రులు, అతిశూద్రులు ఎప్పటివరకైతే విద్యకు దూరంగా ఉండి, మానసిక బానిసలుగా జీవిస్తారో, ఎప్పటివరకైతే ఈ దేశానికి వాళ్ళు ఎమోషనల్ గా మమేకం అవ్వరో – అప్పటివరకు ఒక ‘దేశంగానే’ పరిగణించబడదు (ఈ దేశం స్వరాజ్యం కోసం ఎన్ని పోరాటాలు చేసిన) అని ఆనాడే హెచ్చరించాడు మహాత్మా ఫూలే.
ఇందులో భాగంగా, రాధికమ్మ చేస్తున్న పోరాటం, వేస్తున్న ప్రశ్నలను పౌర సమాజం తేలికగా పక్కన పెడుతూ, రోహిత్ ఎవరు అని అడగడం ఎంతవరకు హర్షించ తగ్గ విషయం? ఇప్పుడు రాధికమ్మ ఒక Part Apart, అందుకే ముత్తు ఆ తల్లి ని ‘A Universal Mother Without a Nation’ అని అభివర్ణించాడు. బహుశా ఈ పౌర సమాజానికి, రాధికమ్మ నుండి Dear Civil Society, I have no homeland అనే మాటను వినాలనుందేమో!
మరోవైపు, బలహీన వర్గాల విద్యార్థులు, యూనివర్సిటీలో చదివే సమయంలో తరచు మనోవేదనకు గురవుతున్న సంఘటనలు మన ముందు ఉన్నాయి. ఈ వేదనకు యూనివర్సిటీలో ఉన్న అసమానత, అమానవీయ సంబంధాలు ఒక ముఖ్య కారణం. ఎన్నో నిజనిర్దారణ కమిటీలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా, న్యాయ పోరాటాలనే దూషిస్తూ, వాటిని అణిచివేస్తూ ఉన్నాయి. ఆనాడు ఫూలే, అంబెడ్కర్, పెరియార్ ఈ దేశం ముందు ఉంచిన మౌలిక ప్రశ్నలను ఈనాటికి ఈ సమాజం తప్పు పడుతూనే ఉంది. మరోవైపు ఈనాడు వ్యవస్థీకృత హత్యలను చూస్తూ, మౌనంగా ఉంటూ – మరణించింది ‘ఎవరు’ అనే ప్రమాణీకం ఆధారంగా తమ చైతన్యాన్ని/పోరాటాన్ని నిర్మిస్తూ – తన ప్రత్యేకతను చాటుకుంది ఈ ఆధునిక పౌర సమాజం. పోరాడుతూ, అవహేళనకు గురవుతున్న రాధికమ్మ లాంటి ఒక తల్లి పడే వేదనను చూస్తూ ఈ సందర్భాన్ని ఇంకో విధంగా ఈ దేశానికి చెప్పాలంటే – Dear homeland, I don’t even belong to your civil society!
చిన్న నాటి నుండి తల్లి దగ్గర్నే పెరిగిన పిల్లలకు వర్తించే కులం గురించి 2012, 2016, 2022 లో కోర్టులు ఇచ్చిన వివిధ తీర్పుల ప్రకారం – రోహిత్ దళితుడే. అయితే రోహిత్ దళితుడు కాదు అని అంటున్న అందరు, తను ఓబీసీ అని ఒప్పుకున్నట్టేనా? ఒకవేళ ఒప్పుకుంటే, ఒక ఓబీసీ విద్యార్ధి మరణించాడు, తనకు న్యాయం జరగాలని చేస్తున్న పోరాటం ఏది? లేక ఒక ఓబీసీ విద్యార్ధి మరణిస్తే ఈ దేశానికి అసలు సంబంధం లేదా? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను ఓబీసీ అని చెప్పి, ఎన్నికల్లో ప్రచారం చేసాడు. ఇప్పుడు అదే ఓబీసీ మరణిస్తే, ఏ మాత్రం చలనం లేకుండా, తన హిందుత్వ రాజకీయాలను శాశ్వతం చేసే పనిలో ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, రోహిత్ దళితుడు అయినా, ఓబీసీ అయినా – పోరాటంలో ఉండేది మాత్రం సామాజికంగా గాయపడ్డ బలహీన వర్గాలే.
అందుకే ఈ ప్రశ్న – రోహిత్ వేముల, తల్లి రాధికమ్మకు దక్కాల్సిన న్యాయం కోసం ఎవరు పోరాడాలి? రోహిత్ ని దళితుడు అని అనుకున్న వాళ్ళ? లేక రోహిత్ మాల కులస్థుడు అని ఒప్పుకున్నా వాళ్ళ? లేక రోహిత్ ఓబీసీ అని ఆలోచిస్తున్న వాళ్ళ? ఇలా ఎంతో మంది కూతుర్లని, కొడుకులని పోగొట్టుకున్న దేశంలో ఉన్న కన్నతల్లులు పోరాడాలా? లేక రోహిత్ మరణంతో ఒక గొప్ప విజ్ఞానవేత్తని కోల్పోయినందుకు, దేశంలో ఉన్న సైన్స్ విద్యార్థులు పోరాడాలా? తమ లాగ రోహిత్ కూడా ఒక విశ్వమానవుడు అని అనుకుంటున్నా ఇతర అభ్యుదయ వాదులు పోరాడాలా ? లేక న్యాయం చేస్తాం అని అంటున్న కాంగ్రెస్ పార్టీ పోరాడాలా ? లేక “నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని, నా కోసం కన్నీరు కార్చకండి, మీకు చేతనైతే, నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి, జీవన రవళిని వినిపించే వెదురువనాన్నై వికసిస్తాను, నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి, చరిత్రపుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను, మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి, ఒక పెనుమంటల పెనుగులాటనై, మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను” అని పిడికెడు ఆత్మగౌరం కోసం కలేకూరి గారు అన్న మాటల్లో, రోహితే మళ్ళీ పుట్టి న్యాయం కోసం పోరాడాలా ?
ప్రశ్నలు ఎన్ని ఉన్న, ఒకటి మాత్రం నిజం. మరణించింది రోహిత్ కాదు, ఈ సమాజం. అవును, తమ కపటత్వంతో, మౌనంతో, సామాజికంగా మరణించింది. రోహిత్ మాత్రం బ్రతికే ఉన్నాడు, ఉంటాడు. My birth is my fatal accident అన్న రోహిత్ ఈరోజు తన డెత్ ని ఒక spectre గా మార్చాడు. ఈ spectre, దేశంలో జరుగుతున్న వ్యవస్థీకృత హత్యలకు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ దేశం, పౌర సమాజం ప్రదర్శిస్తున్న మౌనాన్ని ప్రశ్నిస్తూ, మానవీయ ప్రజాస్వామిక న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో పౌర సమాజం కలిసి అడుగులు వేస్తుందా లేక అదే కుల నిర్లక్ష వైఖరితో అసమానతలకు బలి అవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
~~~
ఫూలే-అంబెడ్కర్ వాది, ఇండిపెండెంట్ రీసెర్చ్ స్కాలర్, సామాజిక – రాజకీయ విశ్లేషకులు అయిన మణికంఠ, తెలంగాణ వాసి. ప్రస్తుతం తెల్లాపూర్, హైదరాబాద్ లో ఉన్న Phule Ambedkar Center for Philosophical & English Training (PACPET) లో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా ఉన్నారు. ఇతర రచనలకు https://independent.academia.edu/PallikondaManikanta