Kranthi Kumar Mungamuri (ముంగమూరి క్రాంతికుమార్)
ఉత్తర్ ప్రదేశ్ యువ బహుజన కార్యకర్త యశ్ పాల్ గౌతం
మరణం లేని నీలి విప్లవం
నా పేరు మరణం లేని నీలి విప్లవం
సమానత్వం కోసం బహుజన తల్లి పురిటి
నెప్పుల నుండి జన్మించినవాడిని
ప్రాచీన కాలపు బుద్ధుడిని, మానవత్వపు దిగంబరుడిని
వర్తమాన సమాజంలో యశ్ పాల్ గౌతముని
బహుజన వారసత్వాన్ని భుజాలపై ముద్దాడినవాడిని
ఏసు ప్రభువు వలె విముక్తీ నినాదాలను గుండెల్లో నింపుకుని
కుల రక్కసి రాజ్యాలపై నృత్యం చేసినవాడిని
విలాస్ గోగ్రే విప్లవ పాఠాలను గ్రామ గ్రామాన భోధించినవాడిని
అందుకే ఆశ తీరని కోరికలాగ మళ్ళీ మళ్ళీ
ఈ నేల మీదే జన్మించాలని ఉంది
అందుకే నా పేరు మరణం లేని నీలి విప్లవం
మీ యశ్ పాల్ గౌతముని….
సదా ఈ అంటరాని దేశంలో జన్మించడానికి
మిణుకు మిణుకు మనే నక్షత్రాల్లోకి నడుస్తాను
చీకటి జీవితాల్లోకి కాంతి కోసం మల మల మండుతున్నా
సూర్యుని పై కన్నెర్ర చేస్తాను
బహుజనుల విముక్తి కోసం చెంద్రునితో చర్చలు చేస్తాను
సజీవ ప్రయాణం కోసం పకృతిలో కలుస్తాను – మమేకమవుతాను
మీకు తెలుసుగా పకృతి మరణం లేనిది !
అందుకే నా పేరు మరణం లేని నీలి విప్లవం
బహుజనుల విముక్తి కోసం మళ్ళీ మళ్ళీ పుట్టే మీ యశ్ పాల్ గౌతముని
ప్రకృతి ని మ్రింగుతూ మరణమెలేని
బహుజన ఉద్యమాలను కౌగిలించుకుంటాను
నేనిప్పుడు అమర ప్రకృతిలో భాగమే, ప్రకృతి నాలో భాగమే
మానభంగాలకు, హత్యాచారాలకు, అణచివేతకు నిలయమైన
బ్రాహ్మణీయ గుళ్ళ ముందు భీమ్ కొరెంగావ్ పాటలు పాడుతాను
గాలిలో కుల వెతిరేక వాయిద్యాలు వాయిస్తాను
నిప్పుల కొలిమిలో బహుజన ఉద్యమాల కత్తులకు పదును పెడతాను
కరుడుగట్టిన బ్రాహ్మణ వ్యవస్థ అంతం కొరకు ఉద్యమై ఊరేగుతాను
అందుకే నా కోసం కన్నీళ్ళు కార్చకండి
నా పేరు మరణం లేని నీలి విప్లవం
మళ్లీ మళ్లీ పుట్టే మీ యశ్ పాల్ గౌతముని…..
~
కవిత అంకితం: యశ్ పాల్ గౌతమ్ గారికి
యశ్ పాల్ గౌతమ్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హపూర్ జిల్లాకు చెందిన బహుజన కార్యకర్త మరియు ప్రముఖ కళా కారుడు. ఈయన బహుజన ఉద్యమ ప్రముఖ ప్రచార కర్తగా భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన వ్యక్తి, ప్రస్తుత కాలంలో కరోనా మహమ్మరితో పోరాడుతూ అకాల మరణం చెందారు, ఈయన మరణం దేశానికి తిరాని లోటు.ఈయన ఎనలేని
కృషినీ స్మరించుకుంటూ బహుజన బిడ్డలందరి తరుపున ఈ కవితను అంకితం చేస్తున్నాము.
~~~
ముంగమూరి క్రాంతికుమార్ ఆంధ్ర ప్రదేశ్లో ఒక అంబేద్కర్ వాది మరియు బహుజన కార్యకర్త.